ప్రముఖ కథానాయిక శృతి హాసన్, పివిపి నిర్మాణ సంస్థ పిక్చర్ హౌజ్ మీడియా మధ్య కేసు కొత్త మలుపు తీసుకుంది. కోర్టులో శృతి హాసన్ న్యాయవాది గట్టిగా వాదనలు వినిపించారు. పివిపి సంస్థ అవాస్తవాలను కోర్టు ముందుంచి శ్రుతిని వేధించడానికి కేసు పెట్టారని, ఒప్పందాలు ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించారు.
నిర్మాణ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. శృతి హాసన్ డేట్స్ కోసం నెలరోజుల ముందు సంప్రదించాలి. అలా చేయకుండా కేవలం కొన్ని రోజుల ముందు ఏప్రిల్ 2 నుండి రెగ్యులర్ షూటింగుకు హాజరుకావాలంటూ తెలియజేశారు. శృతి హాసన్ రాలేనని చెప్పగానే, నటి తమన్నాతో మార్చి 25న ఒప్పందం చేసుకుని ఏప్రిల్ 2 నుండి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. శృతిని మాత్రం తమ సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమాలో నటించకూడదని కోర్టును కోరారు. ఇది కేవలం శ్రుతిని వేధించడమే. ముందుగా 10 లక్షల రూపాయలు అడ్వాన్సు చెల్లించాలి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణ సంస్థ వ్యవహరించడంతో ఈ ఒప్పందం చెల్లదు. కొత్త సినిమాలు అంగీకరించకూడదు అంటూ శృతికి వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని కోర్టును అభ్యర్ధించారు. తమ వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని పిక్చర్ హౌజ్ మీడియా సంస్థ కోరడంతో తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతానికి కేసు శృతికి అనుకూలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.