మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈసారి ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓ పక్క మురళీమోహన్ మద్దతుతో జయసుధ, మరో పక్క నాగబాబు మద్దతుతో రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కొన్ని రోజుల సస్పెన్స్ తర్వాత ఈరోజు ఓట్ల లెక్కింపు జరిగింది. అనూహ్యంగా రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పోటీ వెనుక, రాజేంద్రప్రసాద్ విజయం వెనుక ఎన్నో కారణాలు వున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. అసోసియేషన్‌లో మొత్తం 702 ఓట్లు వుండగా, 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అందులో ఎక్కువ శాతం కృష్ణానగర్ మరియు ఇతర ప్రాంతాల వారివే. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో వుండే పెద్ద హీరోలు, పెద్ద నటీనటులు పలు కారణాలతో ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇదిలా వుంటే జయసుధకి మురళీమోహన్ మద్దతుగా వుండడం వల్లే ఆమె ఓడిపోయారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆరు సార్లు అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వున్న మురళీమోహన్ చిన్న ఆర్టిస్టుల కోసం చేసిందేమీ లేదని అందువల్లే మురళీమోహన్ మద్దతు తెలిపిన జయసుధను ఓడిరచారని అంటున్నారు. అయితే రాజేంద్రప్రసాద్‌కి కూడా ఈ ఎన్నికల్లో అనుకూల వాతావరణం లేదని, నాగబాబు మద్దతుగా వుండడం వల్ల కొంతమంది ఆర్టిస్టుల ఓట్లు ఆయనకు పడ్డాయని, దాంతో విజయం సాధించారని అంటున్నారు. మురళీమోహన్ హయాంలో తమకు చేసిందేమీ లేదని భావించిన సభ్యులు ఆయన మీద కోపంతోనే రాజేంద్రప్రసాద్‌కి అధ్యక్ష పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. మరి చిన్న ఆర్టిస్టులు, టి.వి. ఆర్టిస్టుల మద్దతుతో గెలిచిన రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్‌కు తన సేవలు అందించడంలో, పేద కళాకారులకు చేయూతనివ్వడంలో ఏమేరకు కష్టపడతారో, ఎంతవరకు వారి మన్ననలు పొందుతారో వేచి చూడాలి.