కొరటాల శివ-మహేష్‌బాబుల చిత్రం ‘శ్రీమంతుడు’ (వర్కింగ్ టైటిల్) పూర్తి అయిన వెంటనే మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించే ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీప్రొడ్‌క్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రంలో మహేష్ మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మెయిన్ లీడ్ హీరోయిన్‌గా సమంతను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో రెండు హిట్లు కొట్టిన ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. కాగా ‘1’(నేనొక్కడినే) సమయంలో సమంత, మహేష్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దమే నడిచింది. సోషల్ మీడియా సాక్షిగా మహేష్ అభిమానులు సమంతపై దాదాపు యుద్దం చేశారు. అలాంటి హీరోయిన్‌తో మరలా తమ హీరో నటిస్తున్నాడని తెలిసి, తాము అభ్యంతరం చెబుతున్నప్పటికీ తమ హీరో తమ మనోభావాలను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా మిగతా ఇద్దరు హీరోయిన్లుగా తాప్సి, ప్రణీతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.