విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్ గా టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలలో నటించి తన ఖాతాలో హిట్స్ ను వేసుకున్నాడు. సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ చూపిస్తూ ఒకే విధంగా ఉండే పాత్రల్లో నటించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తండ్రిగా, అన్నగా, తాతగా, విలన్ గా ఇలా ఏ పాత్రలో అయిన ఇమిడిపోయే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ నటించే తదుపరి చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం.
కమల్ హాసన్ నటించిన 'ఉత్తమ విలన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఆ సినిమా విడుదలకు ముందే కమల్ మరో సినిమాలో బిజీ అయిపోయాడు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ చిత్రం కోసం కమల్, ప్రకాష్ రాజ్ మారిషస్ వెళ్లనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 15 నుండి మొదలవ్వనుందని తెలుస్తోంది. మరి ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.