'మా' ఎన్నికల ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది. గత నెల చివరాంకంలోనే ఎన్నికలు ముగిసినా ఫలితాలు మాత్రం వెల్లడికాకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కార్యనిర్వహక అధ్యక్షుడిగా పోటీసినన ఒ. కల్యాణ్ సిటీ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియో ఫుటెజీని కూడా ఈనెల7లోగా కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వీడియో ఫుటెజీని కోర్టులో సమర్పించారు. దీనిపై ఈ సోమవారం వాదనలు జరిగాయి. ఇక బుధవారం ఉదయం తుది తీర్పును వెలువరిస్తూ.. ఎన్నికల ఫలితాలను ఏ సమయంలోనైనా వెల్లడించవచ్చని కోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా తప్పుడు సమాచారంతో కేసు వేసి కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటీషన్‌దారుడు కల్యాణ్‌కు జరిమానా విధించింది. దీంతో 'మా' ఎన్నికల ఫలితాలు ఏ క్షణంలోనైనా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జయసుధ, రాజేంద్రప్రసాద్‌ల మధ్య హోరాహోరీగా సాగిన 'మా' సమరంలో గెలుపెవరిదన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ ఫలితాల కోసం టాలీవుడ్‌తోపాటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.