ఓ గిరిజన యువతి కడుపున పుట్టి అనాథగా మారిన ఓ కుర్రాడిని ఓ అనాథాశ్రమంలోని వార్డెన్ చేరదీస్తుంది. ఆ కుర్రాడికి దొర అని పేరు పెట్టి పెంచుతుంది. ఆమె సహకారంతో చదువుకొని డాక్టర్ కావాలని కల కంటాడు దొర. అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి కులం, రిజర్వేషన్ అడ్డు పడతాయి. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించినప్పటికీ తన కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి సీటు వస్తుంది కానీ దొరకి రాదు. ఓ కులం అంటూ లేని అనాథలు చదువులో మంచి ప్రతిభ చూపినా వారికి తగిన గుర్తింపు రావడం లేదంటూ దొర, అతనితోపాటు కొంత మంది అనాథలు, వార్డెన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీశారు అనేది కథాంశంగా అల్లు వెంకటేష్ ‘స్పందన’(అనాథల కులం ఏమిటి?) అనే షార్ట్ ఫిలింని రూపొందించారు. చిక్కం రామచంద్రరావు సారధ్యంలో సత్య స్నేహామృత క్రియేషన్స్ పతాకంపై మంతెన కేశవరాజు సమర్పణలో అల్లు వెంకటేష్ దర్శకత్వంలో చిక్కం ఉమామహేశ్వరి నిర్మించిన ఈ షార్ట్ ఫిలిం ప్రదర్శన మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐపిఎస్ గోపీనాథ్‌రెడ్డి, ఐఎఎస్ ఉమామహేశ్వరరావు, ఎ.పి. ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ రవీంద్ర, హీరోయిన్ మధుశాలిని, పోతుల విశ్వం, ఆదర్శ్ అనంతనాయుడు, కెమెరామెన్ కృష్ణప్రసాద్, నటుడు కోటేశ్వరరావు, పి.వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ మన దేశంలో 2 కోట్ల మంది అనాధలు వున్నారని, వారిలో ఎక్కువ శాతం ఎవరి ఆదరణ లేక నేరస్తులుగా మారుతున్నారని తెలిపారు. సమాజం వారిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల, పెరిగి పెద్దయిన తర్వాత వారు సమాజంలో అసాంఘిక శక్తులుగా మారుతున్నారని, వారిని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ వుందని అన్నారు. కొన్ని కులాల వారికి రిజర్వేషన్ వుందని, అలాగే రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు వున్నాయని, మరి అనాథలకు ఎందుకు రిజర్వేషన్ లేదని ప్రశ్నించారు. ‘స్పందన’ అనే షార్ట్ ఫిలిం ద్వారా అందరూ స్పందించాల్సిన అవసరం వుందని, ఈ షార్ట్ ఫిలిం చూసిన వారు అందులో ఇచ్చిన ప్రభుత్వ మెయిల్ ఐడికి తమ స్పందనను తెలియజేయాలని కోరారు.
రaాన్సీ, కోటేశ్ మానవ, నిఖిత్, విజయ్, వర్మ, స్వప్న, రాజేశ్వరి, రచన, సాయిలక్ష్మీ, మొహంతి, చలపతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వంశీ, కెమెరా: కృష్ణప్రసాద్, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్, కాన్సెప్ట్, ప్రొడక్షన్ డిజైన్: చిక్కం రామచంద్రరావు, కథ, మాటలు: చిక్కం రామచంద్రరావు, అల్లు వెంకటేష్, సమర్పణ: మంతెన కేశవరాజు, సహనిర్మాతలు: బొంద సూర్యకుమారి, ఆదర్శ అనంతనాయుడు, నిర్మాత: చిక్కం ఉమామహేశ్వరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అల్లు వెంకటేష్.