తన నటనతో ప్రేక్షకులను ఏడిపించే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను ఓ సినిమా ఏడిపించిందట. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'మార్గరిటా'. సొనాలి బోస్ దర్శకురాలు. అయితే సొనాలి తన సోదరి మాలిని జీవితం ఆధారంగా ఈ కథను రెడీ చేసుకున్నారు. ఈ సినిమాలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న పాత్రలో నటించింది. అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడుతూ తన జీవితాన్ని లీడ్ చేస్తుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా ప్రివ్యూ షో కి అమీర్ కు ఇష్టం లేకపోయినా ఆయన భార్య కిరణ్ బలవంతం మీద సినిమాకు వెళ్లారట. సినిమా చూస్తున్నంత సేపు అమీర్ ఏడుస్తూనే ఉన్నాడట. సినిమా అయిన అనంతరం కల్కిని, సొనాలి ని అమీర్ కలిసి ప్రశంసించారని కల్కి తెలిపారు. ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమా ఇండియాలో విడుదల కానుంది.