అభిమానులంతా ఎదురు చూస్తున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు రేటింగ్స్ అనుకున్న స్థాయిలో రాకపోయినా బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రేక్షకులను థియేటర్లకు వెళ్ళేలా చేసింది. సినిమా టాక్ ఎలా వున్నా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం బన్నీ కెరీర్ లో బెస్ట్ గా నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా మొదటి రోజు 13.5 కోట్ల వసూళ్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్లు రావడం విశేషం. 2015 లో వచ్చిన సినిమాలతో పోలిస్తే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాలలో మొదటి స్థానంలో 'సన్నాఫ్ సత్యమూర్తి' ఉంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ ఈ సినిమాకి ఎసెట్ అని చెప్పాలి.