అలీ గొప్ప హాస్యనటుడు అన్నది ఎవరూ కాదనలేనిది. హాస్యానికి కూడా హద్దులు ఉంటాయనేది గత కొంతకాలంగా అలీ మరిచిపోయినట్టున్నాడు. సినిమాలోనైనా, ఏదైనా వేదికపై అయినా హాస్యాన్ని పండిస్తే నలుగురు నవ్వుకుని ఆనందిస్తారు. కానీ ఇటీవల కాలంలో అలీ ఉన్న వేదికపైకి సినీ ప్రముఖులు రావాలంటే భయపడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. తన వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు ఎక్కడ బలి అవ్వాల్సి వస్తుందోనని. అవును.. అలీ తీరు రోజురోజుకి శృతిమించుతోంది. తను యాంకరింగ్ చేసే ఆడియో వేడుకలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. తోటి వ్యాఖ్యాతలపై డబుల్ మీనింగ్‌లు సంధించడం అలీకి మామూలైపోయింది. తోటివారు అతని మాటలకు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా అతను గ్రహించలేకపోతున్నాడు. వేదిక మీద ఉన్న వారి ఇమేజ్‌ను కూడా గుర్తించకుండా సెటైర్లు, ఏ రేటెడ్ డైలాగ్‌లు వెయ్యడంతో అలీ ఉన్న వేదికపైకి ఎక్కాలంటే సినీ ప్రముఖులు భయపడుతున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన లయన్ ఆడియో వేడుకలో అలీ హద్దులు మీరి మాట్లాడాడు. ఎపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు హాజరైన వేడుక అది. అంతమంది ప్రముఖులున్నా ఏమనుకుంటారో అనే కామన్‌సెన్స్ కూడా లేకుండా అలీ చెలరేగిపోయాడు. ఈసారి హాట్ యాంకర్ అనుసూయను టార్గెట్ చేస్తూ పలు డైలాగ్‌లు వదిలాడు. బూతు డైలాగ్‌లు అనుసూయకు కొత్తేమీ కాదు కాబట్టి లైట్ తీసుకొని ఓ చిరునవ్వు వదిలింది. హీరోయిన్ త్రిషని కూడా వదలలేదు. కొందరైతే అతని మాటలకు సిగ్గుపడ్డారు. ఇటీవల సుమ యాంకరింగ్ చేసిన ఓ వేదికపై అలీ కూడా ఉన్నాడు. ఆ వేదిక మీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో జనాల్ని హింసించాడు. అయితే సుమ చాకచక్యంగా టాపిక్ డైవర్ట్ చేసి కార్యక్రమంలోకి తీసుకెళ్లింది. తర్వాత సుమ అతనికి వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. కొంత కాలానికి అలీతో కలిసి యాంకరింగ్ చెయ్యడానికి ఏ లేడీ యాంకర్ ముందుకు రాని పరిస్థితి కూడా వచ్చేలా ఉంది. ఇకపై అయినా అలీ తన తీరు మార్చుకుంటే మంచిదని పలువురు చెబుతున్నారు.