వెయ్యేళ్ళ 'మాహిష్మతి' రాజ్యం కథే - 'బాహుబలి'.
తెలుగు వెండితెరపై సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి దర్శకధీరుడు రాజమౌళి సిద్దమవుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' కోసం 'మహిష్మతి' రాజ్యాన్ని సృష్టించాడు. వెయ్యేళ్ళ కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అప్పట్లో జరిగే యుద్ద సన్నివేశాలు, పోరాట ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కళా దర్శకుడు సాబు సిరిల్ చెప్పారు. కోటలు, ఆయుధాలు, యుద్ద సామాగ్రి, కత్తులు ఇలా ప్రతి అంశంలో ఎంతో పరిశోధన చేసి రూపొందించామని తెలిపారు.
చరిత్ర పుటల్లో కనిపించని రాచరికపు యుగాన్ని ఆవిష్కరించడానికి రెండేళ్ళ నుండి చిత్ర బృందం నిరంతరం కష్టపడింది. రాజమౌళి ఊహల్లో రాజ్యానికి రూపునివ్వడానికి కళా దర్శకుడు సాబు సిరిల్ చాలా కష్టపడ్డారు. కష్టాన్ని ఇష్టంగా భావించడంతో రెండేళ్ళ పాటు ఇతర చిత్రాలకు పని చేయలేదు. ఇదొక ప్రాంతీయ చిత్రం కాదని, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న తెలుగు చిత్రమని సాబు సిరిల్ వెల్లడించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 'బాహుబలి' చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
ప్రభాస్,అనుష్క, తమన్నా నటీనటులుగా, రానా ప్రతినాయకుడి పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంయం కీరవాణి సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు. మే 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు.