‘ఆర్య’ చిత్రంతో ప్రేమకథా చిత్రాల్లో ఓ ట్రెండ్‌ను సృష్టించాడు దర్శకుడు సుకుమార్. మొదట్నుంచి సుకుమార్ పంథాయే వేరు. సుకుమార్ సినిమా అనగానే ప్రేక్షకులు కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ యువ దర్శకుడు తన విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటాడు. కాగా ప్రస్తుతం సుకుమార్-ఎన్టీఆర్ కలయికలో త్వరలో ఓ సినిమా రాబోతుంది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల మధ్య వుండే సున్నితమైన భావోద్వేగాలను సుకుమార్ తనదైన శైలిలో ఆవిష్కృతం చేయబోతున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే సరికొత్తగా వుండబోతుందని... ఎన్టీఆర్ పాత్ర కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ని నిర్ణయించారట. ఈ టైటిల్ పెట్టడానికి సుక్కుకు తన తండ్రి తిరుపతిరావు నాయుడు గారిపై వున్న ప్రేమే కారణమని అంటున్నాయి సినీ వర్గాలు. మొదట్నుంచీ ఆయనకు తండ్రంటే ప్రాణమని.. ఇటీవల ఆయన మరణించిన బాధను నుంచి తేరుకున్న సుకుమార్ ఆయన మీద వున్న ప్రేమతో..మనసుపెట్టి ఈ కథను తయారుచేశాడట..ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సన్నివేశాలన్నీ తన నిజజీవితం నుంచే ప్రేరణ పొంది రూపొందిస్తున్నాడని సమాచారం.