తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా ఈ విడుదలవనున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటిభాగం మే15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే మూడు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఒకేసారి నిర్వహించేలా.. లేక ఒక్కో భాషకు ఒక్కోసారి నిర్వహించాలా అన్న ఆలోచనలో ఇప్పుడు 'బాహుబలి' సతమతమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఏ భాషలో సినిమా విడుదలైతే ఆ సినిమాకు ప్రత్యేకంగా ఆడియో విడుదల ఫంక్షన్ నిర్వహిస్తారు. అయితే 'బాహుబలి' ఆడియోను సరికొత్త పంథాలో ఒకేసారి మూడు భాషల్లో విడుదల చేయాలని రాజమౌలి భావిస్తున్నట్లు సమాచారం. కాని ఇలా విడుదల చేస్తే మూడు భాషల ప్రజల దరికి ఆడియో చేరుకుంటుందా..? లేక ఏదైనా సమస్య ఉత్పన్నమవుతుందా..? అన్న అనుమానాలు తలెత్తినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు.