మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రచ్చ' సినిమా విడుదలై నేటికి మూడేళ్ళు పూర్తయింది. 'ఆరంజ్' ప్లాప్ తో డీలా పడ్డ మెగా హీరోకు, అభిమానులకు ఊరటనిచ్చిన సినిమా ఇది. 'రచ్చ'కు ముందు చరణ్ చేసింది మూడు సినిమాలే. మొదటి సినిమా 'చిరుత'తో పర్వాలేదు అనిపించుకున్నాడు. చరణ్ అద్బుత అభినయం కనబరచినా 'మగధీర' క్రెడిట్ రాజమౌళి ఖాతాలోకి వెళ్ళింది. హీరోగా మాస్ ప్రేక్షకులలో చరణ్ ను తిరుగులేని హీరోని చేసింది మాత్రం 'రచ్చ' సినిమానే. దాని క్రెడిట్ లో కొంత భాగం దర్శకుడు సంపత్ నందికి ఇవ్వాలి.
ఒక చిన్న సినిమా తీసిన అనుభవం మాత్రమే ఉన్న సంపత్ నంది, 'రచ్చ'తో మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ మూడేళ్ళలో చరణ్ నాలుగు సినిమాలు చేశాడు. హీరోయిన్ తమన్నా ఏకంగా పది సినిమాలలో కనిపించింది. సంపత్ నంది మాత్రం మరో సినిమా చేయలేదు. 'గబ్బర్ సింగ్ 2' చేయాలని ఆశపడి భంగపడ్డాడు. కారణాలు ఏవైనా సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడి నుండి మూడేళ్ళలో మరో సినిమా రాకపోవడం మంచి పరిణామం కాదు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'బెంగాల్ టైగర్' చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 'రచ్చ'ను మించిన హిట్ అయ్యి... సంపత్ నంది మూడేళ్ళ కష్టం వృధా కానివ్వదని ఆశిద్దాం.