‘అత్తారింటికి దారేది’ చిత్రం రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. ఈ రికార్డును ‘1’, ‘ఆగడు’ వంటి చిత్రాలు బద్దలు కొడతాయని అందరూ ఆశించారు. కానీ అవి ఏవీ ‘అత్తారింటికి దారేది’ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. కానీ ఈ సారి సమ్మర్‌లో విడుదలయ్యే చిత్రాల్లో ఏదో ఒకటి 100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 100కోట్లతో రూపొందుతున్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం 100కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఇక సినిమా బాగుంటే ‘రుద్రమదేవి’ వంటి చిత్రం కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ‘రేసుగుర్రం’తో 50కోట్ల క్లబ్బులో చేరిన అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా 60కోట్లపై కన్నేసింది. ఇక జులైలో వచ్చే మహేష్`కొరాటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్ టైటిల్)కు కూడా 100కోట్ల క్లబ్బులో చేరే సత్తా ఉందనేది వాస్తవం. మొత్తానికి ఈ వేసవిలో టాలీవుడ్‌లో మొత్తం 400కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుండటం విశేషం.