మార్చి 29న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్న ప్రధాన అభ్యర్థులు రాజేంద్రప్రసాద్, జయసుధ. గత నాలుగు రోజులుగా ఈ రెండు ప్యానెల్‌కు సంబంధించిన సభ్యులు మీడియా ముందుకు వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ రెండు ప్యానెల్స్ చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించిన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శుక్రవారం ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డా॥ శ్రీనాథ్, రోషం బాలు, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రదీప్ పాల్గొన్నారు.
డా॥ శ్రీనాథ్: గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. పోటీ చేస్తున్న వారు గెలిస్తే ఇండస్ట్రీలోని కళాకారులకు ఏం చేస్తారనేది చెప్పాల్సిన అవసరం వుంది. అలా కాకుండా ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. అసోసియేషన్‌లో ఇలాంటి చిచ్చు రగలడం విషాదకరం. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ గెలిస్తే వారు ఏం చెయ్యబోతున్నారో చెప్తున్నారు. కానీ, జయసుధ ప్యానెల్‌వారు మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప వారు చేస్తారో చెప్పడంలేదు. 21 సంవత్సరాలు ఇక్కడ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వుంది. దీని ద్వారా నటీనటులకు పనికొచ్చే పని ఏదైనా చేశారా అని నేను ప్రశ్నిస్తున్నాను. కొత్తవారికి అవకాశం ఇచ్చారా? కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా? ఎంతో మంది ఆర్టిస్టులు వున్నారు. కానీ, అసోసియేషన్‌లో సభ్యులు మాత్రం 702 మంది మాత్రమే. ఎందుకంటే సభ్యత్వం కావాలంటే లక్ష రూపాయలు చెల్లించాలి. అసోసియేషన్‌లో మూడున్నర కోట్ల నిధి వుంది. అలాంటప్పుడు లక్ష రూపాయలు మెంబర్‌షిప్ కోసం అడగడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటివి అసోసియేషన్‌లో చాలా వున్నాయి. ముందు మేం చెప్పేది ఏమిటంటే అసోసియేషన్‌ని ముందు ప్రక్షాళన చేయండి. ఆ తర్వాత మీరు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారో చెప్పండి.
రోషం బాలు: తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2009లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో స్టార్ట్ అయింది. రాష్ట్రాలు విడిపోయినా అందరం కలిసే వుండాలని చెప్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ వున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాత్రం మేడిపండులా వుంది. లోపల అన్నీ పురుగులే వున్నాయి. ఈ ఎలక్షన్స్ సందర్భంగా వారి ప్రవర్తన చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. ఎంతోమంది పెద్దలు వున్నారు. వారు నచ్చజెప్పాల్సిన అవసరం వుంది. ఇకనైనా మీ తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నాను.
సి.వి.ఎల్.నరసింహారావు: 29న జరగనున్న ఎన్నికలు ఆపెయ్యాలంటూ కోర్టులో కేసు వేశారు. ఎన్నికలు యధాతథంగా జరగాలనీ, ఫలితాలు మాత్రం 31న వెల్లడిరచాలని కోర్టు ఆదేశించింది. ఈ ఎలక్షన్స్‌కి ఇలాంటి సమస్య రావడం నిజంగా బాధాకరం. గెలిస్తే ఎవరేం చేస్తారనేది పక్కన పెడితే ముందు అసోసియేషన్‌లో సభ్యులు ఐకమత్యంగా వుండాల్సిన అవసరం వుంది. అసోసియేషన్‌లో ఎన్నో సమస్యలు వున్నాయి. ఉదాహరణకి ఒక ఆర్టిస్టు తనకు మందులు కొనుక్కునేందుకు కూడా డబ్బు లేదని, తనకి పెన్షన్ ఇప్పించాలని అడిగితే, ఈ విషయాన్ని కమిటీకి పంపిస్తామని, వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత నాలుగు రోజులకే దురదృష్టవశాత్తు ఆ ఆర్టిస్టు చనిపోయాడు. మరొకరికి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్‌కి గురైన వ్యక్తిపైనే కేసు పెట్టిన చరిత్ర మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి వుంది. ఇలాంటి అవకతవకలు చాలా వున్నాయి. ముందు వాటన్నింటినీ సరిచేసుకోవాల్సిన అవసరం వుంది.