సినీ రంగంలో హీరోల తర్వాత హవా మొత్తం దర్శకులకే. గుర్తింపుతో పాటు పారితోషికం విషయంలో కూడా ఈ ఇద్దరే ముందు రేసులో ఉంటారు. రాను రాను రచయితలకు సరైన గౌరవం లభిస్తుండకపోవడంతో చాలామంది రచయితలు దర్శకులుగా అవతారం ఎత్తుతున్నారు. త్రివిక్రమ్ నుండి నిన్న వచ్చిన అనిల్‌రావిపూడి వరకు ఎందరినో ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శ్రీనువైట్ల కోనవెంకట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోనవెంకట్ వంటి స్టార్ రైటర్స్ దర్శకులుగా మారితే పరిశ్రమలో రచయితల కొరత ఏర్పడుతుంది. నాలాంటి డైరెక్టర్లు చాలామంది ఆయనపై ఆధారపడి ఉంటారు. అందుకే ఆయన రచయితగా ఉండిపోతేనే పరిశ్రమకు మంచిది... అంటూ వ్యాఖ్యానించాడు. శ్రీనువైట్ల వ్యాఖ్యలకు కోనవెంకట్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. అక్కడే ఉన్న మరో రచయిత గోపీమోహన్ మాత్రం చప్పట్లు కొడుతూ... శ్రీనువైట్ల చెప్పిన దాంట్లో నిజం ఉంది . కోన వెంకట్ లాంటివారు రచయితగా పరిశ్రమకు సేవలందిస్తేనే ఎక్కువ హిట్ చిత్రాలు వస్తాయి.దర్శకునిగా మారడం వల్ల ఆయనపై ఆధారపడ్డ డైరెక్టర్లు ఇబ్బందులు పడతారు... అని వ్యాఖ్యానించాడు.