తెలుగులో సాయిదరమ్‌తేజ్ పాటించిన రూటులోనే లోకనాయకుడు కమల్‌హాసన్ కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సాయి విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రం ‘రేయ్’ బిజినెస్ కాకపోవడంతో తన రెండో చిత్రం ‘పిల్లా..నువ్వులేని జీవితం’ విడుదల చేసి ఆచిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన తర్వాత మొదటి చిత్రం ‘రేయ్’కు బిజినెస్ జరిగి ఇప్పుడు ఆ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అలాగే కమల్‌హాసన్ కూడా ‘విశ్వరూపం’ సినిమా తీసినప్పుడు అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అదృష్టవశాత్తు ఆ వివాదాలు సినిమాకు మంచి హైప్‌ను తీసుకొని వచ్చి, డిస్ట్రిబ్యూటర్ల సంగతి ఎలా ఉన్నా.. కమల్‌కు ఆర్ధికంగా లాభాన్నే చేకూర్చాయి. అయితే దానికి సీక్వెల్‌గా తీసిన ‘విశ్వరూపం2’ మాత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. దీనికి కారణం ఆ చిత్రానికి బిజినెస్ కాకపోవడమే కారణం అని తెలుస్తోంది. దీంతో ‘విశ్వరూపం2’ తర్వాత మొదలుపెట్టిన ‘ఉత్తమవిలన్’ చిత్రాన్ని ముందుగా విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం హిట్టయితే ‘విశ్వరూపం2’కు బిజినెస్ జరుగుతుందనే ఆశలో ఆయన ఉన్నాడంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని కమల్ కాకుండా బయటి నిర్మాత వేణు రవిచంద్రన్ తీస్తున్నాడు. దీన్ని బట్టి ‘ఉత్తమవిలన్’ విడుదలై హిట్టైతేనే ‘విశ్వరూపం2’కు మోక్షం అని చెప్పవచ్చు.