ఇంతకాలం కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు. ఆల్‌రెడీ అల్లుఅర్జున్, రామ్‌చరణ్, మహేష్‌బాబులు మలయాళంలో మార్కెట్‌లో విస్తరిస్తున్నారు. వారు నటించిన తెలుగు చిత్రాలు మలయాళంలో అనువాదం అవుతున్నాయి. కాగా త్వరలో అల్లుఅర్జున్ మలయాళంలో ఓ స్ట్రెయిట్ సినిమాతో, తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహేష్‌బాబు నటించిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం మలయాళంలో విడుదలైంది. త్వరలో ఈ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేసి విడుదల చేయనున్నారు. ఇక నాగచైతన్య వంటి యంగ్‌హీరో కూడా ‘దోచెయ్’ తర్వాత తాను ‘కార్తికేయ’ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించనున్నారు. ఇక ఇప్పటికే మణిరత్నం సినిమాతో ఆ అవకాశం కోల్పోయిన మహేష్‌బాబుతో ఓ తమిళ చిత్రం చేయడానికి అక్కడి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. సీనియర్ హీరో నాగార్జున కార్తితో చేస్తున్న చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతోంది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘బాహుబలి’ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. మొత్తానికి ఇంతకాలానికి మన హీరోలకు ఇతర భాషలపై కన్ను పడటం ఆనందించదగ్గ విషయమే.