స్టార్స్ సినిమాల ఖర్చును నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో మన హీరోలే నిర్మాతలుగా మారుతున్నారు. హీరోలుగా ఎన్నో ఘనవిజయాలు సాధించిన వీరు కోట్లు ఖర్చుపెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి వీరు నిర్మాతలుగా కూడా సక్సెస్ అవుతారా? లేదా? అనే విషయం ఉత్కంఠను కలిగిస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమాకు నితిన్ విపరీతంగా ఖర్చుపెడుతున్నాడట. తన సినిమాలకు కేవలం 15కోట్లు లోపే ఖర్చుపెట్టే నితిన్ అఖిల్ సినిమా కోసం దాదాపు 40కోట్లకు పైగా ఖర్చుపెట్టే ఉద్దేశ్యంలో ఉన్నాడట. ఇక పవన్‌కల్యాణ్ త్వరలో నిర్మాతగా మారి రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్‌చరణ్ సినిమా అంటే బడ్జెట్ 40కోట్లకు తక్కువ ఉండదు. అయినా పవన్ దానికి సిద్దపడుతున్నాడు. తాను మాత్రం ‘గోపాల గోపాల’ వంటి మినిమం బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న పవన్ రామ్‌చరణ్ సినిమా కోసం మాత్రం డబ్బుకు వెనకాడదలుచుకోలేదని తెలుస్తోంది. ఇక రామ్‌చరణ్ కూడా తన తండ్రి చిరంజీవి నటించే 150వ చిత్రానికి తానే స్వయంగా నిర్మించనున్నాడు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమైనా వెనకాడేది లేదంటున్నాడు. మరి హీరోలుగా సక్సెస్ అయిన వీరు నిర్మాతలుగా కూడా సక్సెస్ అవుతారో లేదో వేచిచూడాల్సివుంది....!