ఇటీవల విడుదలైన ‘రుద్రమదేవి’ చిత్రం ట్రైలర్‌పై మిశ్రమస్పందన వస్తోంది. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకునేలా లేవని కొందరు అంటున్నారు. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్‌లో రెండు డైలాగులు వివాదం సృష్టించేలా ఉన్నాయని, కావాలని పక్కా ప్లాన్‌తో వివాదం సృష్టించి దాని నుండి లబ్ధి పొందడానికి దర్శకనిర్మాత గుణశేఖర్ ప్రయత్నిస్తున్నాడని కొందరు తప్పుపడుతున్నారు. ఈ చిత్రంలోని ట్రైలర్‌లో గోనగన్నారెడ్డిగా నటించిన అల్లుఅర్జున్ ‘నేను తెలుగు భాష లెక్క. ఆడ ఉంటా.. ఈడ ఉంటా..’ అనే డైలాగ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో వాడినదిగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక రుద్రమదేవిగా టైటిల్ రోల్ పోషిస్తోన్న అనుష్క... ‘ఒకే తల్లిపాలు తాగినోళ్లు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అయినప్పుడు ఒకే నది నీరు తాగినోళ్లు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కాలేరా..’ అనే డైలాగ్ కూడా ఉంది. ఇది కూడా తెలంగాణ, ఆంద్ర ప్రజలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌గా కనిపిస్తోంది. ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి.