రాజధాని భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఒక్కటైన బేతపూడిలో పవన్‌కల్యాణ్ పర్యటన ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ పర్యటనలో పవన్ తన మిత్రపక్షాలతోపాటు వైరి పక్షాలకు కూడా చురకలంటించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి చేసిన తప్పును పునరావృతం చేయవద్దని, రాజధాని ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగితే నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని హెచ్చరించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవచ్చని, కాని భూసేకరణ చట్టాన్ని వినియోగిస్తే మాత్రం తాను వ్యతిరేకిస్తానని పవన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా సింగపూర్ అంత విశాలమైన రాజధాని రాష్ట్రానికి అవసరమా అన్నది కూడా ఆలోచించాలని చెప్పారు. ఇక గతంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించిన జగన్‌వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు. తాను ఐదేళ్ల తర్వాత గురించి ఆలోచించడం లేదని, ఇప్పటినుంచే రైతులకు అండగా పోరాడుతానని చెప్పారు. ఇక కొద్దిరోజుల క్రితం బేతంపూడిలో గ్రామస్తులు భూసేకరణ నుంచి పవన్‌కల్యాణ్ తమను కాపాడాలంటూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పవన్ అక్కడ పర్యటించడంతో ప్రభుత్వం బేతంపూడిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న ఆసక్తినెలకొంది.