‘హ్యాపీడేస్’తో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్ తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండాలని కోరుకుంటాడు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో రూపొందిన ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ చిత్రాలు పెద్ద హిట్ అయి హీరోగా నిఖిల్‌కి మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్‌తో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
ఈ సినిమా కోసం బాగా స్లిమ్ అయినట్టున్నారు?
అవునండీ. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం కష్టపడి 10 కిలోలు తగ్గాను. డైరెక్టర్ కార్తీక్ ఈ లుక్ రావాలని చెప్పారు. అందుకే జిమ్ చేస్తూ ఫ్రూట్స్ తింటూ ఈ లుక్‌కి వచ్చాను. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌కి అది అవసరం.
ఇది ఎలాంటి సినిమా అని చెప్పొచ్చు?
కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ వుంటాయి, కొన్ని క్యారెక్టర్ డ్రివెన్ వుంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ఇది థ్రిల్లర్, మళ్ళీ ఒక సస్పెన్స్ సినిమా చేశారు అనుకుంటున్నారు. ఇందులో సస్పెన్స్ వుంటుంది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. కానీ, మెయిన్‌గా చెప్పాలంటే ఇది ఒక లవ్‌స్టోరీ. నా కెరీర్‌లో ఇప్పటివరకు లవ్‌స్టోరీ చెయ్యలేదు. అంతకుముందు కాలేజ్ స్టూడెంట్‌గా చేశాను, మాస్ మూవీస్ చేశాను. ఇది టోటల్‌గా లవ్‌స్టోరీ. హీరో, హీరోయిన్ లవ్‌లో పడడం, బ్రేకప్ అవడం, మళ్ళీ కలవడం వుంటాయి. కానీ, ఇందులో ఒక డిఫరెంట్ పాయింట్ వుంటుంది.
ఆ డిఫరెంట్ పాయింట్ ఏమిటి?
ఈ సినిమాలో హీరోకి పర్‌ఫేరియా అనే ఒక జబ్బు వుంటుంది. హిమోగ్లోబిన్ తక్కువగా వుండడంల్ల ఇది వస్తుంది. దీని గురించి రీసెర్చ్ చేశాం. కోటి మందిలో ఒకరికి వస్తుంది. ఈ వ్యాధి వున్నవాడు వెలుతురులోకి రాలేడు. వస్తే స్కిన్ బర్న్ అయిపోతుంది. ఐదు, పది నిముషాల్లో చనిపోతాడు. అలాంటి క్యారెక్టర్ హీరోది. వెలుతురులోకి రాలేని హీరో, పగలంటే ఇష్టపడే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడతాడు, ఆ అమ్మాయిని ఎలా దక్కించుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
కెమరామెన్ కార్తీక్‌తో సినిమా చెయ్యాలని ఎందుకనిపించింది?
కార్తికేయ సినిమా టైమ్‌లో కార్తీక్ నాకు పరిచయమయ్యాడు. ఆ సినిమాకి అతని కెమరా వర్క్ చాలా బాగుంది. చాలా కలర్‌ఫుల్‌గా తీశాడు. అతని దగ్గర మంచి టాలెంట్ వుంది అనుకున్నాను కానీ డైరెక్టర్ అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఓరోజు నాకు ఈ కథ చెప్పాడు. ఆ పాయింట్‌య వినగానే నాకు భయమేసింది. అయితే దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడిరచాడు. మదర్ సెంటిమెంట్ వుంది. నాకు తనికెళ్ళ భరణిగారు, సత్య ఫ్రెండ్స్. లవ్, రొమాన్స్ వుంటూనే ఒక డిఫరెంట్ పాయింట్‌తో కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. శివకుమార్‌గారికి చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. దీనికి సంబంధించి మేజర్ థాంక్స్ శివకుమార్‌గారికే ఇవ్వాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాని కూడా ఆయన చెయ్యడానికి ముందుకొచ్చారంటే చాలా గ్రేట్.
హీరోకి వున్న డిసీజ్‌కి సంబంధించి ఏదైనా కన్‌క్లూజన్ వుంటుందా?
కన్‌క్లూజన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం. ఆ కన్‌క్లూజన్ రియలిస్టిక్‌గా వుంటుంది. దానికి సంబంధించి ఒక డైలాగ్‌లో చెప్పాలంటే సినిమా స్టార్టింగ్‌లో ‘నా పేరు సూర్య.. నేను సూర్యుడ్ని చూడలేను’ అంటాను. అంటే ఒక నెగెటివ్ ఫీలింగ్ అది. క్లెమాక్స్‌లో ‘నా పేరు సూర్య.. నాకు సూర్యుడ్ని చూసే అవసరం లేదు’ అంటాను. అది ఒక పాజిటివ్. నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మారడానికి కారణం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అతని లైఫ్‌లోకి ఎలా వచ్చింది. అతన్ని నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి ఎలా మార్చింది అనేదే కథ.
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య..ఇలా అన్నీ డిఫరెంట్ సినిమాలు చెయ్యాలన్న డెసిషన్ మీదేనా? లేక మీ దగ్గరికి వచ్చే కథలే అలా వుంటున్నాయా?
ఇప్పుడు తెలుగులో పది, పదిహేను మంది హీరోలు వున్నారు. నేను అప్ కమింగ్ హీరోని. నన్ను ప్రేక్షకులు థియేటర్ వరకు వచ్చి చూడాలంటే నేను చేసే సినిమాల్లో కథ చాలా స్ట్రాంగ్‌గా వుండాలి. ఎలా వుండాలంటే నేను హీరో కాకుండా ఎవరు హీరో అయినా ఆ సినిమా హిట్ అవ్వాలి. అలాంటి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నది నా కోరిక.
ఇలా ప్రతి సినిమా డిఫరెంట్‌గానే చేస్తారా?
డెఫినెట్‌గా చేస్తాను. ఎందుకంటే నాకు కూడా బోర్ వచ్చేస్తుంది. స్వామిరారా తర్వాత అలాంటి క్రైమ్ కామెడీతో వున్న సబ్జెక్ట్ పది వరకు వచ్చాయి. అవి నేను చేసి వుంటే రెగ్యులర్ అయిపోయేది. అలాగే కార్తికేయ తర్వాత హార్రర్ సబ్జెక్ట్స్ వచ్చాయి. నేను చెయ్యనని చెప్పాను. సూర్య వర్సెస్ సూర్య పూర్తి డిఫరెంట్ మూవీ. దీని తర్వాత చేయబోయే సినిమా మరో ప్యాట్రన్‌లో వుంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో నిఖిల్.