రైల్వే బడ్జెట్‌పై అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంలో భాగస్వామిపక్షం, ఏపీలో అధికారపక్షమైన టీడీపీ నాయకులు కూడా ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే అధికారపక్షం మినహాయించి విపక్షాలన్ని బడ్జెట్‌పై పెదవి విరిచాయి. ఆశ్చర్యకరంగా టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయని, ఇది తమ కృషి ఫలితంగానే జరిగిందంటూ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణకు వీరు కొత్తగా సాధించిన ప్రాజెక్టులు ఏంటి..? ఎన్ని కొత్త రైళ్లు వేయించారు..? కనీసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలన్న కనీస విజ్ఞప్తినైనా కేంద్రం పట్టించుకుందా..? ఈ విషయాలేవీ పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత మొదలు ప్రతిఒక్కరూ బీజేపీ భజన మొదలుపెట్టారు. అప్పట్లో బీజేపీ అంటే అగ్గిమీద గుగ్గిలమయ్యే టీఆర్‌ఎస్ నేతల వాయిస్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు కొత్త సంకేతాలనిస్తున్నట్లు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరేందుకు సమయం ఆసన్నమైందని, ఎంపీ కవితకు సెంట్రల్ మినిస్టర్ హోదా దక్కే సమయం మరెంతో దూరంలో లేదన్న వాదనలు వినబడుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రజలెవరికీ రుచించని రైల్వే బడ్జెట్ టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రం భలే తిపిని మిగిల్చిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.