ఏపీ రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణ తీవ్ర వివాదంగా మారుతోంది. కొన్ని గ్రామాల ప్రజలు భూములివ్వడానికి ముందుకువస్తున్నా.. మిగిలిన వారు మాత్రం తమ పంట పొలాలను ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఇక గుంటూరు జిల్లా బేతపొడి గ్రామస్తులు భూముల సమీకరణకు వ్యతిరేకంగా వినూత్నరీతిలో ఆందోళనకు దిగారు. తాము పవన్ కల్యాణ్ చెప్పడంతోనే టీడీపీకి ఓటు వేసి గెలిపించామని, ఇప్పుడు తమ భూములు కాపాడాల్సిన బాధ్యత కూడా పవన్‌పైనే ఉందని వారు జనసేన జెండాలను పట్టుకొని నిరసనకు దిగారు. తాము బాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మమని.. ఇప్పుడు పవన్ తమకు మద్దతుగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలను అటు కేంద్రంగాని.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంగాని నిలబెట్టుకోలేదు. ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ మరి ఇప్పుడు అటు చంద్రబాబు ఇటు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. లేకపోతే మరికొంతకాలం వేచిచూసి ఆ తర్వాత ఉద్యమానికి సిద్ధం అవుతారా..? లేక మైత్రి ఒప్పందానికి లోబడి నోరు విప్పకుండా సర్దుకుపోతారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.