ఎన్నికలకు ముందు తర్వాత రాజకీయాల్లో పొత్తు భాగస్వామ్యాలు రసవత్తరంగా మారుతుంటాయి. ఎన్నికలకు ముందు ఒకరిపైకొకరు కత్తులు దూసిన పార్టీలే ఆ తర్వాత అధికారం కోసం ప్రాణమిత్రుల్లా కలిసిపోతుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి జమ్ముకాశ్మీర్‌లో రిపీట్ అవుతోంది. 87 సీట్లున్న జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి 2014 నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో మూడు నెలలుగా అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఇక ఇదేసమయంలో అంతకుముందు బద్ధ శత్రువుల్లా వ్యవహరించిన బీజేపీ, పీడీపీలు దగ్గరయ్యాయి. పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయీద్‌కు సీఎం సీటును ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం ఓకే చెప్పడంతో కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370పై ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. దీనిపై రాజీకి రావడానికి ముఫ్తీ మహ్మద్ సయ్యీద్ శుక్రవారం పీఎం నరేంద్రమోడీతో చర్చలు జరపనున్నాడు.