రైల్వే మంత్రి సురేష్ ప్రభు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ అంటే తప్పనిసరిగా కొత్త రైళ్లను ప్రకటించడంతోపాటు కొత్త ప్రాజెక్టులను కూడా పదుల సంఖ్యలో ప్రకటింకచేవారు. వాటిలో ఏమేర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి.. ఏ మేర పెండింగ్ లిస్టులో చేరిపోయేవి అని గమనిస్తే సాధారణ ప్రజానికానికి నిరాశ తప్పదు. ఈసారి మాత్రం సురేష్‌ప్రభు ఒక్క కొత్త రైలును కూడా ప్రకటించలేదు. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టుల గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా కేవలం రైల్వే వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీఠ వేశారు. బయోటాయిలెట్స్, 400 స్టేషన్లలో వైఫై సౌకర్యం, 5 నిమిషాల్లో టికెట్ల వెండింగ్ మెషిన్, విద్యుద్దీకరణ లైన్ పెంపు, అతి తక్కువ ధరకు తాగునీరు, ఆన్‌లైన్‌లో భోజనం ఆర్డర్, మహిళల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు, కొన్ని సెలక్టెడ్ లైన్స్‌లో వేగం పెంపునకు చర్యలు, అప్పర్‌బెర్త్ చేరుకునేందుకు నిచ్చెన సౌకర్యం తదితర మూలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యతనిచ్చారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ బడ్జెట్‌లో ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 27 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టును మినహాయించి మిగిలిన వాటి ప్రస్తావన కూడా రాలేదు. ఇక విజయవాడను జోన్‌గా ప్రకటిస్తారని ఆశించిన ఏపీ వాసులు ఈ బడ్జెట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే మిగిలిన రాష్ట్రాలకు కూడా ప్రాజెక్టులు ప్రకటించకపోవడంతో ఏపీని నిర్లక్ష్యం చేశారన్న వాదనకు బలం చేకూరడం లేదు.