గత ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా జగన్ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండలేదు. అయితే చివరికి ఫలితాలు మాత్రం వైసీపీ నాయకులకు చుక్కలు చూపించాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, మహిళల్లో, పేదల్లో జగన్ కుటుంబానికి ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. యువతలో మాత్రం ఆయనపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఆ తర్వాత తేలింది. అందునా ఉన్నత విద్యావంతులైన యువత సోషల్‌మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని హోరెత్తించడంతోనే వైసీపీ దారుణ పరాజయాన్ని అందుకుందని సుస్పష్టం. ఇక ఇప్పుడు ఈ తప్పును దిద్దుకునే బాటలో ప్రయాణించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. తాను కూడా సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఖాతా తెరిచి ఉన్నత విద్యావంతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఏపీతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించడానికే జగన్ ఈ ఖాతా తెరిచారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి తన కొంపముంచిన సోషల్‌మీడియాలోనే ఖాతా తెరిచిన జగన్ ప్రజలను ఇప్పుడు ఏమాత్రం ఆకట్టుకుంటారో వేచిచూడాల్సిందే..?