ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ఏమాత్రం సమయాన్ని వృథా చేయడం లేదని, రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రిస్తూ కష్టపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ విషయంలో నిజానిజాలను పక్కనపెడితే ప్రయాణలకు సంబంధించి మాత్రం బాబు సమయం వృథా చేయడం లేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఢిల్లీ, బెంగళూరుకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో కూడా జిల్లాలకు ఆయన విమానాల్లోనే ప్రయాణిస్తూ సమయాన్ని బాగా ఆదా చేసుకుంటున్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన ప్రయాణ సమయం ఆదా ప్రభుత్వంపై రూ. 15 కోట్ల భారం మోపింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి విదేశీ, స్వదేశీ విమాన ప్రయాణాలను కలుపుకొని బాబు మొత్తం 67 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన బకాయి రూ.15 కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ, మౌళికవసతులు, పెట్టుబడుల శాఖలు వేర్వేరుగా జీవోలు జారీ చేశాయి. తన ఆకాశయాన ప్రయాణాలకు ఇంతమొత్తంలో ఖర్చుపెట్టడం కంటే ప్రభుత్వమే సొంతంగా ఓ విమానాన్ని కొనుగోలు చేయడం నయమేమో..!