ఈ వేసవిలో ఎండలే కాదు... పెద్ద పెద్ద చిత్రాలు కూడా సెగను పుట్టించడానికి రెడీ అవుతున్నాయి. నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేయనున్నాయి. బన్నీ నుండి బాలయ్య వరకు పలు భారీ చిత్రాలు ఈ ఏడాది వేసవిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఇన్ని సినిమాలు వస్తే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లకు గండి పడుతుందని తెలిసినప్పటికీ ఎవ్వరూ వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఫిబ్రవరిలో అన్‌సీజన్‌గా చెప్పుకునే సమయంలో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద చూపిన ‘టెంపర్’ వేడిలో అందరూ ఉన్నారు. మార్చిలో గుణశేఖర్, అనుష్క, బన్నీల ‘రుద్రమదేవి’, బాలయ్య నటించిన ‘లయన్’ విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో అల్లుఅర్జున్`త్రివిక్రమ్‌ల ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో పాటు మరికొన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. ‘బాహుబలి’ మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే సీజన్‌లో రవితేజ ‘కిక్2’, గోపీచంద్ ‘జిల్’, నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, నిఖిల్ ‘సూర్య వర్సెస్ సూర్య’, నాగచైతన్య ‘దోచెయ్’ వంటి చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది సమ్మర్ బిజినెస్ 400కోట్లకుపై మాటే అని తెలుస్తోంది.