ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సీఐడీ జరుపుతున్న విచారణలో రెండో నివేదికను ప్రభుత్వానికి స్పందించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,94,264 ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. వాటిలో దాదాపు లక్ష ఇళ్లకు సంబంధించి చిరునామాలు కూడా దొరకడం లేదని, కొన్ని గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా నిర్మించకుండానే బిల్లుల రూపంలో అధికారులు దోచుకున్నారని స్పష్టం చేసింది. ఇక తాము గత ఆరునెలలుగా జిల్లాకు రెండు నియోజకవర్గాలు, ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు గ్రామాల చొప్పున మొత్తం 36 గ్రామాల్లో విచారణ సాగిస్తే దాదాపు 50 శాతం ఇళ్లు బోగసేనని తేలినట్లు చెప్పింది. ఇక ఇన్ని ఇళ్లకు సంబంధించి విచారణ జరపాలంటే మొత్తం సీఐడీ డిపార్ట్‌మెంట్‌తోపాటు పోలీస్‌శాఖను కూడా పూర్తిగా వినియోగించినా అసాధ్యమని, తమను ఏం చేయమంటారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. అయితే సీఎం కేసీఆర్‌కు కూడా ఈ విచారణ అసాధ్యమని తెలుసునని, కేవలం కాలయాపన కోసమే ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణ సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదలకాక వేల మంది లబ్ధిదారుల ఇళ్లు చివరిదశలో ఆగిపోయాయి. ఆ లబ్ధిదారులంతా ఇప్పటికే కేసీఆర్ మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరి కేసీఆర్ ఇంకా కాలయాపన చేస్తారా..? లేక ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.