జి.ఎస్. డిజిటల్ డ్రీమ్ డిజైనర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సోషియో ఫాంటసీ నేపథ్యంలో మంచి కథ, కథనాలతో వినోదాత్మకంగా గోలి శ్యామల స్వీయ దర్శకత్వంలో రూపొందిన 2డి యానిమేషన్ ఫిల్మ్ ‘లిటిల్ డ్రాగన్’. ఈ యానిమేషన్ ఫిల్మ్‌కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సి.వేణుగోపాలాచారి, నటుడు అవసరాల శ్రీనివాస్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు వసంత్ ఆధ్వర్యంలో జరిగిన మ్యాజిక్ షో అందర్నీ అలరించింది. ఈ సందర్భంగా..
తలసాని శ్రీనివాసయాదవ్: పిల్లలకు ఎంతో ఇష్టమైన ఇలాంటి యానిమేషన్ మూవీస్ ఇంకా రావాల్సిన అవసరం వుంది. శ్యామలగారు రూపొందించిన ఈ ‘లిటిల్ డ్రాగన్’ తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను.
తుమ్మల నాగేశ్వరరావు: పుస్తకాలు చదివిన దానికంటే ఒక బొమ్మని చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. శ్యామలగారు చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఇలాంటి యానిమేషన్ మూవీస్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను.
సి.వేణుగోపాలాచారి: శ్యామలగారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యానిమేషన్‌కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వున్నాయి. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇలాంటి యానిమేషన్ మూవీస్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం వుంటుంది.
బసిరెడ్డి: శ్యామలగారు ఎంతో కష్టపడి, ఎంతో మందిని ఉద్యోగాల్లో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా వున్నప్పుడు గత ప్రభుత్వం గేమ్‌సిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం గేమ్‌సిటీని డెవలప్ చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను. దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తారు.