కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి నిపుణులు ముక్కున వేలేసుకున్నారు. ఇది నిజంగా కేసీఆర్ కలల బడ్టెటేనని, అది నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువని అంచనా వేశారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. భూముల విక్రయం ద్వారా రూ. 6 వేల కోట్లు సమీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఎలాంటి వివాదాలు లేని భూములను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతా చేస్తే హైదరాబాద్‌లో కేవలం 9 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు అధికారులు తేల్చారు. ఈ 9 ఎకరాలు కూడా అమ్మిస్తే ఇక నగరంలో ప్రభుత్వానికి సెంటు భూమి కూడా లేనట్లే. ఇక వివాదాల్లో ఉన్న భూమి జోలికి కోర్టు ఆదేశాలు లేకుండా ప్రభుత్వం వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ 9 ఎకరాలు అమ్మి దాదాపు రూ. 350 కోట్లు సమీకరించవచ్చని అధికారులు తేల్చినట్లు లెక్క. ఇక అదేవిధంగా స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా 5 వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఓవైపు గడువు దగ్గరపడుతున్నా.. ఇప్పటికి క్రమబద్ధీకరణ ద్వారా వచ్చింది మాత్రం కేవలం రూ. 11 కోట్లే. ఇక ఈ లెక్కన కేసీఆర్ ప్రకటించిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటోనని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.