ప్రముఖ నిర్మాత, మూవీమొఘల్ డా॥ డి.రామానాయుడు ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఫిబ్రవరి 20న ఫిలిం ఛాంబర్‌లో సంతాప సభ ఏర్పాటు చేసింది. ఈ సంతాప సభలో ప్రముఖ నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, ఎ.రమేష్‌ప్రసాద్, సూర్యనారాయణ, కె.అశోక్‌కుమార్, కె.సి.శేఖర్‌బాబు, సి.వి.రెడ్డి, కె.రాఘవ, పోకూరి బాబూరావు, బూరుగపల్లి శివరామకృష్ణ, కాజా సూర్యనారాయణ, డా॥ కె.వెంకటేశ్వరరావు, పి.ఎన్.రామచంద్రరావు, చంద్రమహేష్, ఎన్.వి.ప్రసాద్, మోహన్ వడ్లపట్ల, నట్టికుమార్, ప్రముఖ దర్శకులు బి.గోపాల్, బోయిన సుబ్బారావు, త్రిపురనేని చిట్టి, కాశీ విశ్వనాథ్, వీరశంకర్, నటులు మహర్షి రాఘవ, మాడా వెంకటేశ్వరరావు, శివకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణలతోపాటు డా॥ డి.రామానాయుడు తనయుడు వెంకటేష్, మనవడు రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా॥ డి.రామానాయుడు మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయనతో తమకు వున్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. నిర్మాత అంటే నిజమైన నిర్వచనం రామానాయుడు అనీ, క్రమశిక్షణకు, నిబద్ధతకు మారు పేరు ఆయన అనీ, భారత దేశానికి మహాత్మా గాంధీ ఎంతటివారో, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రామనాయుడు అంతటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. డా॥ డి.రామానాయుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొందరు దర్శకనిర్మాతలు కన్నీళ్ళ పర్యంతమై మాట్లాడలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాప సభకు హాజరైన వారంతా నిముషంపాటు మౌనం పాటించారు. చివరిగా హీరో వెంకటేష్ తన తండ్రిపై అందరూ చూపిస్తున్న అభిమానానికి, ఆయన పట్ల వారికి వున్న గౌరవానికి తనకి మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనవుతున్నానని అన్నారు.