తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖ నిర్మాతలున్నప్పటికీ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మూవీమొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా॥ డి.రామానాయుడు కన్ను మూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రామానాయుడు ఈరోజు హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరుతో 1964లో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా నటరత్న ఎన్.టి.రామారావుతో ‘రాముడు`భీముడు’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించిన నిర్మాతగా రామానాయుడు మంచి పేరు తెచ్చుకున్నారు. ‘నమ్మినబంటు’ చిత్రం షూటింగ్ కారంచేడులో జరుగుతున్నప్పుడు అందులో చిన్న వేషం వేశారు రామానాయుడు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఆయనకు పరిచయం ఏర్పడిరది. ‘మీరు సినిమాల్లోకి వస్తే బాగా రాణిస్తారు’ అని అక్కినేని చెప్పిన మాటను నమ్మి మద్రాసు చేరుకున్న రామానాయుడు ‘అనురాగం’ అనే చిత్రానికి భాగస్వామిగా చేరి అలా నిర్మాతగా మారారు. అయితే సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌ని స్థాపించి నిర్మించి తొలి చిత్రం ‘రాముడు భీముడు’. నిర్మాతగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామానాయుడు ఇప్పటివరకు 135 చిత్రాలకుపైగా నిర్మించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు..ఇలా రామానాయుడు అందరు హీరోలతో చిత్రాలు నిర్మించారు. తను నిర్మించే ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సీన్‌లో కనిపించాలన్న సెంటిమెంట్ వున్న రామానాయుడు దాన్ని కంటిన్యూ చేశారు. ఆయన నిర్మించిన 135 చిత్రాల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్ చిత్రాలే వుండడం, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలే కావడం విశేషం. మంచి నిర్మాతగానే కాదు, మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్న రామానాయుడుకి పాత్రికేయులంటే విపరీతమైన అభిమానం. పాత్రికేయులను కుటుంబ సభ్యులుగా భావించి ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. రామానాయుడులాంటి నిర్మాత, మంచి వ్యక్తి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బంధువులు, అభిమానులు రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి హైదరాబాద్‌కి తరలి వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. డా॥ డి.రామానాయుడు అంత్యక్రియలు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలోనే నిర్వహించాలని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగుతాయి. పాత్రికేయులతో ఎంతో సన్నిహితంగా వుండే రామానాయుడు ఇకలేరనే వార్తను పాత్రికేయులు, మీడియా జీర్ణించుకోలేకపోతోంది. రామనాయుడు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది ‘సినీజోష్’.