రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకోండి అంటూ చంద్రబాబు, ఆయన మీడియా ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తన ప్రయాణాలకు కోట్లు ఖర్చుబెడుతున్నా అడిగేవారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బాబులాంటి వీవీఐపీలు ప్రయాణించడానికి విమానాలను వాడుకున్నా.. అందులో బిజినెస్ క్లాస్‌టిక్కెట్లను బుక్ చేస్తారు. అయితే బాబు మాత్రం తాను విదేశాలకు వెళ్లాలన్నా.. పక్కనున్న బెంగళూరుకు వెళ్లాలన్న కూడా ప్రత్యేక విమానాన్ని తెప్పించుకుంటున్నారు. గత ఎనిమిది నెలల కాలంలో బాబు తన విమాన ప్రయాణాలకు నెలకు రూ. 2 కోట్ల చొప్పున మొత్తం రూ. 16 కోట్లను ఖర్చుచేశారు. దీనికి బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో ప్రత్యేక కేటాయింపులు చేయాలని ఆర్థికశాఖను ప్రభుత్వం కోరింది. ఇక కొన్నిసార్లు అధికారులు, ఇతర మంత్రులతో కలిసి ప్రయాణించడానికి ఏకంగా రెండుమూడు విమానాలను వినియోగిస్తుండటం గమనార్హం.