తెలుగులో అనతికాలంలోనే పాపులర్ అయిన మాటీవీ దినదినాభివృద్ధి చెందుతూ తెలుగులో నెంబర్‌వన్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌గా విస్తరించింది. మాటీవీ నెట్‌వర్క్‌లో దాదాపు అరడజనుకు పైగా ఛానెల్స్ ఉన్నాయి. తాజాగా మాటీవీని స్టార్ ఇండియా నెట్‌వర్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన డీల్‌లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మాటీవీలోని వాటాలను కొనుగోలు చేసింది. అయితే మార్కెట్ రేటు ప్రకారం ఎంత మొత్తం వెచ్చించారనేది విలేకరులు ప్రశ్నించగా, మీడియా సమావేశంలో ఎవ్వరూ స్పందించలేదు. అనధికార సమాచారం ప్రకారం దీని విలువ 2500 కోట్లు ఉంటుందని అంచనా. మాటీవీ రాకముందు తెలుగులో సన్ నెట్‌వర్క్‌కు చెందిన జెమినీ టీవీ ఆధిక్యం ప్రదర్శించేది. అయితే మా రాకతో సీన్ మారింది. నెంబర్‌వన్ ప్లేస్‌లో మాటీవీ నిలిచింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఇందులో 60 శాతం వాటా ఉండగా, నాగార్జున, చిరంజీవిలకు 20, 20 శాతం వాటాలు ఉన్నాయి. ఈ డీల్ ద్వారా వీరికి భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇక మాటీవీ స్టార్ గ్రూప్‌లోకి చేరిపోవడంతో ప్రస్తుతం రెండో సీజన్‌లో ఉన్న నాగార్జున ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ గేమ్ షో ను కూడా ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నారట. మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో టీఆర్పీలు తక్కువగా వస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.