ప్రముఖ రచయిత, దర్శకుడు పూసల(74) కన్నుమూశారు. ఇటీవల కేర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఎదురవ్వడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రచయితగా 64 కథలు రచించిన ఆయన ‘డాలర్‌కి మరో వైపు’ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. చదువుకునే రోజుల నుండి నాటకరంగంపై పూసలకు మంచి పట్టుంది. ఆయన రచించి, నటించిన ‘మండువ లోగిలి’ నాటకానికి బళ్ళారి రాఘవ అవార్డ్‌తోపాటు పలు అవార్డ్‌లను అందుకున్నారు. ఇటీవల జయప్రకాష్‌రెడ్డి (సింగిల్ క్యారెక్టర్) కీలక పాత్రధారుడుగా ఆయన డైరెక్ట్ చేసిన ‘అలెగ్జాండర్’ నాటకానికి చక్కని ప్రశంసలు అందుకున్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ‘డాలర్‌కి మరో వైపు’ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. పూసల అంత్యక్రియలు సోమవారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరుగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.