>ఎన్టీఆర్-పూరీ : ఇద్దరికీ సరైన సమయంలో పెద్ద హిట్!!
> చిన్న సినిమాలు విజయం సాధిస్తే పరిశ్రమలోని పదిమంది కొత్తవారికి పనిదొరుకుతుంది. పెద్ద సినిమా హిట్టయితే పది చిన్న సినిమాల ఫ్లాప్‌లను కాపుకాస్తుంది. పూరీ జగన్నాధ్ హిట్టయితే తెలుగు సినిమా నిర్మాణంలో కొత్త ట్రెండ్ ఆరంభమవుతుంది. ఎన్టీఆర్ సినిమా హిట్టయితే తారకరాముని లెగసీ కంటిన్యూ అవుతుంది.
> ఎన్టీఆర్ ఫ్యామ్లీ మళ్ళీ బాక్సాఫీసు రేసులో దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ సినిమా ` అంటే బాలయ్య బాబే గుర్తుకొచ్చేవారు ఒకనాడు. ‘ఆది’ తర్వాత వయసుకి మించిన భారీ విజయాల్ని ఖాతాలో జమచేసుకున్న ఎన్టీఆర్ తారాజువ్వలా సినీ వినీలాకాశంలో దూసుకుపోయాడు. ‘‘బృందావనం’’ వరకు నింగిలో నిప్పులు చెరుగుతూ వచ్చిన తారాజువ్వ నేలకొరగడం ప్రారంభించింది. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రామ్ పరిస్థితికూడా ఇబ్బందికరంగా కనిపించింది. కళ్యాణ్‌రామ్ నటించిన 12 సినిమాలలో ‘‘అతనొక్కడే’’ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ‘‘పటాస్’’ మాత్రమే. డీలాపడిన ఎన్టీఆర్ ఫాన్స్‌కి ‘‘పటాస్’’ ఓ టానిక్‌లా పనిచేసింది. ‘‘టెంపర్’’కి సూపర్‌టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సాహం ఉత్తుంగ గంగా ప్రవాహంలా ఉరకలేస్తోంది. ‘ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, అదుర్స్’ రేంజన్‌ని ‘‘టెంపర్’’ అధిగమిస్తుందని సినీ పండితుల అంచనా! పూరీ జగన్నాధ్ మరోమారు తన చేవని ప్రదర్శించారు. సినీ అభిమానులకు కనులవిందైన పసందు బోజనాన్ని వడ్డించారు. లాంగ్ లివ్ ఎన్టీఆర్!
>-తోటకూర రఘు