మానవాళికి జ్గానాన్ని ప్రసాదించే అత్యుత్తమ ఉత్తమ గ్రంధం 'భగవద్గీత' అని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్య నిర్వహణాధికారి 'పోలా భాస్కర్' పేర్కొన్నారు. 'భగవద్గీత ఫౌండేషన్ ' ఆధ్వర్యంలో రూపొందిచిన 'సంపూర్ణ భగవద్గీత ఆడియో' తొలి ప్రతిని తిరుమల శ్రీవారి చెంతకు తీసుకు వెళ్లేందుకు అలిపిరి పాదాల మండపం వద్ద బుధవారం (11-2-15) చేపట్టిన పాదయాత్రను జే ఈ వో ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలా భాస్కర్ మాట్లాడుతూ..'సనాతన హైందవ ధర్మ ప్రచారానికి 'భగవద్గీత' ఎంతగానో తోడ్పడుతుందన్నారు. భారతదేశం లో 'గీత' కు ఎంతో ప్రాశస్త్యం ఉందని, ఇది మానవాళి ఉత్తమ జీవన విధానాన్ని నిర్దేశిస్తుందని వివరించారు. 'భగవద్గీత'లోని మొత్తం 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా రికార్డ్ చేసి భక్తులకు అందించేందుకు 'భగవద్గీత ఫౌండేషన్' వ్యవస్థాపక అధ్యక్షుడు యల్.వి. గంగాధర శాస్త్రి ఏడేళ్ళ కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా అలిపిరి పాదాల వద్ద భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, గాయకుడు సంగీత దర్శకుడు గంగాధరశాస్త్రి మాట్లాడుతూ..' భారతీయ సంగీత చర్రిత్రలోనే మొట్టమొదటి సారిగా అత్యున్నత సాకేంతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా సంపూర్ణ భగవద్గీత గానాన్ని తెలుగు తాత్పర్య సహితంగా రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆడియో సిడి ల తొలి ప్రతిని సుప్రసిద్ధ గాయకుడు 'ఘంటసాల' వర్ధంతి సందర్భంగా బుధవారం (11-2-15) తిరుమలకు పాదయాత్రగా తీసుకువెళ్లినట్లు తెలిపారు. సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి తొలి ప్రతిని శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చినట్లు ఆయన తెలిపారు.100 మందికి పైగా సాంకేతిక నిపుణులు, పండితుల సహకారంతో ఈ సంపూర్ణ భగవద్గీతను రూపొందించామన్నారు. దీనికి అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తి అన్నారు. భక్తిగీతాలు, గోవింద నామ స్మరణ, భగవద్గీత శ్లోకాల సందేశాన్ని మననం చేసుకుంటూ వెళ్లి ఆడియో సిడి ల తొలి ప్రతిని శ్రీవారి పాదాల చెంత ఉంచటంతో ఈ పాదయాత్ర ముగిసిందని అన్నారు.. ఈ ఆడియో సిడి ల ప్యాక్ లో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, సంపూర్ణ భగవద్గీత పారాయణం, రికార్డింగ్ ప్రక్రియకు సంభందించిన లఘు చిత్రం కలిపి మొత్తం 20 సిడి లు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసాంతంలో సంపూర్ణ భగవద్గీత' ఆడియో విడుదల అవుతుందని గంగాధర శాస్త్రి ఈ సందర్భంగా తెలిపారు.