తిరుపతి శాసన సభకు ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం మొదలైన పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణంతో తిరుపతిలో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు వైసీపీ పార్టీ దూరంగా ఉండగా కాంగ్రెస్‌నుంచి శ్రీదేవి బరిలోకి దిగారు. మరోవైపు టీడీపీనుంచి వెంకటరమణ భార్య సుగుణమ్మ బరిలోకి దిగగా.. కొందరు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంప్రదాయాలను అనుసరించి వైసీపీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపలేదు. ఇక శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ పోలింగ్ 35 శాతం దరిదాపుల్లో ఉన్నట్లు సమాచారం. దీన్నిబట్టి ఇక్కడ 60 శాతం పోలింగ్ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకుల అంచనా.