వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారంపై పరువునష్టం దావా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజధానికి సీఈఓగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ ఈ పరువు నష్టం దావా వేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో శ్రీకాకుళంలో పనిచేసినప్పుడే శ్రీకాంత్‌కు తమ్మినేనికి మధ్య విభేదాలున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక అదే సమయంలో రాజధాని కోసం భూముల సేకరణలో శ్రీకాంత్ అక్రమాలకు పాల్పడుతున్నారని, అమాయకులైన రైతులపై వేధింపులకు దిగుతున్నాడని తమ్మినేని ఆరోపించారు. రైతులు రెండో పంట వేసుకోవద్దని శ్రీకాంత్ చెబుతున్నారని, అలా చెప్పడానికి ఆయనకు ఏం అధికారం ఉందని కూడా తమ్మినేని ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో శ్రీకాంత్ శ్రీకాకుళంలో పనిచేసినప్పుడు నరమేధానికి దిగాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ కోర్టులో పరువు నష్టం దావా వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే రాజకీయ నాయకులపై పరువునష్టం దావాలు వేయడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం సాధారణంగా జరిగేవి కదా..!!