జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వేళ వేల రూపాయల కోట్లు దారాళంగా ఖర్చు చేస్తాయి. ఇక ఎన్నికల కమిషన్‌కు సమర్పించే అధికారిక లెక్కల్లో కూడా ఎన్నికల ఖర్చును వందల కోట్లుగా చూపుతాయి. ఈ నిధులన్ని విరాళాల ద్వారానే సేకరించినట్లు చెబుతాయి. అదేసమయంలో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం రూ. 2 కోట్ల విరాళం వచ్చింది. మరి ఇన్ని నిధులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలంటూ ఐటీ శాఖ ఆప్ పార్టీకి నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. జాతీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు చేసి ఎలాంటి లెక్కలు చూపకున్నా పట్టించుకోని ఐటీ శాఖ కేవలం రూ. 2 కోట్ల కోసం ఆప్‌కు నోటీసులు జారీ చేయడం విస్మయం కలిగించే విషయమే. లేకపోతే ఎన్నికల్లో ఓటమికి బీజేపీ అధిష్టానం ఈరకంగా ఆప్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవే నిజమైతే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అప్రతిష్టపాలు కాక తప్పదు. ఇవి నిజంగానే ప్రతీకార చర్యలైతే మరి వీటికి మోడీ మద్దతు ఉందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.