మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి తన భర్త రాంజీ నుంచి కోటి పది లక్షల రూపాయలు తీసుకున్నారని, ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో మనోవేదనకు గురైన రాంజీ మరణించడాని ఆమె ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వరరావు, కొప్పుల రాజు, మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు హాజరైన సమావేశానికి వచ్చిన ఆమె రేణుకపై ఆరోపణలు చేస్తూ ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా పలువురు గిరిజనులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అయితే అంతర్గతంగా ఉన్న పార్టీ విభేదాల కారణంగానే రేణుకపై ఈ ఆరోపణలు వచ్చాయా..? లేక పార్టీ అధిష్టానాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న రేణుక మరి నిజంగానే రూ. 1.10 కోట్లు లంచంగా తీసుకున్నారా..? అనే విషయాలపై పార్టీ నాయకుల్లో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు తనకు న్యాయం చేయకుంటే ఎంతకైనా వెనుకాడేది లేదని రాంజీ భార్య హెచ్చరించారు. దీనికపై ఇంకా రేణుక చౌదరి స్పందించాల్సి ఉంది.