కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయనే కోట్లాది మంది ఆశలతో కేసీఆర్ గద్దెనెక్కారు. ఇక ఆయన ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలన్ని వెంటనే నెరవేరుస్తారని భావించిన ప్రజలు నెలలు గడిచినా అవి అమలులోకి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. చెప్పినవన్ని కాకున్నా.. కొంతమేరకు ఆయన కూడా పలు సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అర్హులకు మాత్రమే చేరేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఆ పథకాలకు అనర్హులుగా ప్రకటించిన వారినుంచి మాత్రం టీఆర్‌ఎస్‌కు శాపనార్థాలు తప్పలేదు. ఇక మరోవైపు గత కొన్ని నెలలుగా ఆయన రోజుకో పథకాన్ని, ప్రాజెక్టును ప్రకటిస్తున్నారని, కాని అవి కార్యరూపం దాల్చే అవకాశాలు మాత్రం కనబడటం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే తరుణంలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన్నప్పటినుంచి దాదాపు 200 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పింది. ఈ లెక్కన దాదాపు ఆయన రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లే. ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలంటే ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. పథకం వ్యయం, లబ్ధిదారుల సంఖ్య, భవిష్యత్తుపై ప్రభావం తదితర పరిణామాలన్నింటి గురించి ఆలోచించి నివేదిక వచ్చి అమల్లోకి వచ్చే సరికి నెలల కాలం పడుతోంది. మరి దీన్నిబట్టి కేసీఆర్ 8 నెలల కాలంలోనే 200 పథకాలు ప్రవేశపెట్టారంటే కేసీఆర్ పానల తీరును అర్థం చేసుకోవచ్చని విపక్షాలు విమర్శిస్తున్నారు.