భారత్‌పై పాక్ ముష్కరులు దాడి చేసిన ప్రతిసారి ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. అయితే అంతర్జాతీయ ఒత్తిళ్లతో ప్రతిసారి భారత్ వెనుకడుగు వేసేది. పార్లమెంట్‌పై, ముంబైపై ముష్కరులు దాడి చేసిన సమయంలో అప్పటి ప్రధానులు పాక్‌పై సైనికచర్యకు తీవ్రంగా యోచించారు. కాని అటు తర్వాత వారు నెమ్మదించి పాక్‌పై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ వేదికలపై ప్రకటనలు హోరెత్తించారు. ఇక భారత్‌పై ఉగ్రవాదుల దాడులకు పాక్ సాయం ఉందని తెలిసినా ఏ దేశం కూడా పాక్‌పై చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. అదేసమయంలో మళ్లీ పాక్‌నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందోనని దేశవాసులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే గతంలో జరిగిన విధంగా పెద్దస్థాయిలో ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేస్తే మోడీ ఉపేక్షించారని, పాక్‌పై తప్పకుండా సైనికచర్యకు దిగుతారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. గత ప్రధానుల్లా కాకుండా మోడీ పాక్‌పై యుద్ధానికి సాహసించే అవకాశం ఉందని ఆ దేశం భావిస్తోంది. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పాక్‌ను అమెరికా హెచ్చరించినట్లు సమాచారం.