2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఢిల్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మానియాతో బీజేపీ విజయం ఖాయమని ముందే తెలిసిపోయింది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం పోరు హోరాహోరీగా సాగుతుండటంతో యావత్ దేశమంతా ఢిల్లీవైపు ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడి పోరులో బీజేపీదే విజయమని ముందుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కితగ్గకుండా ప్రచారంలో దూసుకెళ్లడంతో చివరిరోజుల్లో సమీకరణాలు మారిపోయియి. దాదాపు అన్ని మేజర్ టీవీ చానళ్ల ఓపినియన్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని ఓడించింది. దీంతో మేల్కొన్న బీజేపీ అధిష్టానం ఒకేసారి 11 మంది కేంద్ర మంత్రులను రంగంలోకి దించి చివరి 2 రోజుల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది. ఇక ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకుగాను 673 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా 1.33 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు.