తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పరీక్షా విధివిధానాలను రూపొందించేందుకు ఏర్పాటుచేసిన హరగోపాల్ కమిటీ తన తుది నివేదికను సమర్పించింది. అయితే నియామకాల ప్రక్రియలో కూడా మార్పులు చేయాలని ఈ కమిటీ భావించినప్పటికీ చివరకు కేవలం సిలబస్‌లు మాత్రమే మార్పుచేర్పులను సూచించింది. మరోవైపు గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లోకి మార్చే విషయమై కమిటీ సభ్యులు చివరి నిమిషాల్లో అయోమయంలో పడ్డారు. అలాగే ఇకపై గ్రూపు-2 పోస్టులకు కూడా గ్రూపు -1 మాదిరిగానే వ్రాత పరీక్షను పెట్టాలని కూడా కమిటీ భావించింది. అయితే ఈ రెండు విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థులు టీఎస్‌పీఎస్సీ భవనం ముట్టడికి వస్తున్నారన్న సమాచారంతో కమిటీ సభ్యులు చివరి నిమిషంలో వెనక్కితగ్గారు. ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే పరీక్షలు కొనసాగించాలని నివేదించారు. ఇక హరగోపాల్ కమిటీ ఇచ్చిన నివేదికను మరో వారం రోజుల్లో టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వానికి పంపించనుంది. అటు తర్వాత మరో నెల రోజుల వ్యవధిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని విద్యార్థులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.