ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు కడుపునిండా పీఆర్‌సీ ప్రకటించింది. దాదాపు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో సర్కారు ఉద్యోగుల వేతనాలు రెట్టింపు కానున్నాయి. దాదాపు నెలకు రూ. 20 వేల వేతనం తీసుకునే ఉద్యోగి ఇకపై రూ.40 వేల వేతనాన్ని పొందనున్నాడు. అదే సమయంలో సర్కారుపై ఏటా రూ. 6500 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక వేతనాలు రెట్టింపు కావడంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజల్లో మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వృద్ధులకు, వికలాంగులకు నెలకు కొంత పింఛన్ ఇవ్వడానికి సవాలక్ష కొండీలు పెట్టి.. ఆఫీసుల చుట్టూ వందల సార్లు తిప్పించుకున్న సర్కారు ఏం కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి వేతనాలు రెట్టింపు చేశారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో చాలామంది పింఛన్లు, రేషన్‌కార్డులు కోల్పోయారని, పేదలను పస్తులుంచి ఉద్యోగులను దోచిపెట్టే రకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గితే సామాన్యులకు కొంతమేలు జరిగేదని, వ్యాట్ పేరిట కేసీఆర్ దానికికూడా వారిని దూరంచేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో రాజకీయ పార్టీల్లోనూ ఉద్యోగులకు ఒకేసారి 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతున్నా.. ఉద్యోగ సంఘాలకు భయపడి వారు స్పందించడానికి వెనకడుగు వేస్తున్నారు.