అంతర్జాతీయంగా, జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. జాతీయ స్థాయిలో తగ్గిన ధరలకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యాట్ పేరిట ట్యాక్స్ పెంచుతూ ప్రజలకు ప్రయోజనం లేకుండా చేయడమే లక్ష్యంగా సర్కారు ముందుకు కదుల్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గగానే టీ-సర్కారు వ్యాట్ పెంచేసింది. గతంలో పెట్రోలుపై ఉన్న వ్యాట్ ట్యాక్స్ శాతాన్ని 31 నుంచి 35.2 శాతానికి, డీజిల్‌పై 22.25 శాతాన్ని 27 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణలోనే డీజిల్, పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఇక జనవరి 16న రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరిట పెంచిన రూ. 2ను తగ్గిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. అయితే అదే సమయంలో దాదాపు 5శాతం వ్యాట్ పెంచడంతో దాదాపు లీటర్‌పై రూ. 4 ధర పెరిగింది. దీన్నిబట్టి గత ధరకు అదనంగా మరో రూ. 2 పెరిగింది. ఇక దీనిపై రాష్ట్ర సరిహద్దుల్లోని బంక్‌ల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమ వద్ద ఎవరూ డీజిల్ పోయించుకోరని, ధర తక్కువగా ఉన్న పక్క రాష్ట్రాల్లోనే వాహనాలు డీజిల్ పోయించుకుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి ఇక తాము బంక్‌లు మూసుకోవాల్సిందేనని చెబుతున్నారు.