చంద్రబాబు పదవుల పందెరానికి తెరతీశారు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు దొరకనివారికి, ఓటమి పాలైన నాయకులకు, పార్టీ ప్రధాన అనుచరగణానికి పదవులు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్‌యార్డులకు చైర్మన్లను నియమించడానికి దాదాపు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే దాదాపు 24 మార్కెట్‌యార్డులకు చైర్మన్ల ఎంపికను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే వారిపేర్లు మాత్రం బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తపడుతున్నారు. అదేసమయంలో జిల్లా గ్రంథాలయాలకు చైర్మన్లను కూడా నియమించాలని బాబు భావిస్తున్నారు. ఈ మేరకు ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ సమాచారం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో పైరవీలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా తమకు ఎలాగైన ఓ పదవి కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నామినేటెడ్ పదవుల కోసం పోటీ తీవ్రస్థాయిలో ఉంది.